ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక

ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల వల్ల ఆ దేశ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ, అసలు ప్రమాదం మాత్రం తొలగిపోలేదని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) హెచ్చరించింది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, కార్యక్రమాన్ని పునర్నిర్మించుకునే సామర్థ్యం చెక్కుచెదరకుండా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రాసీ ఆదివారం ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

"దాడుల కారణంగా ఇరాన్ అణు కార్యక్రమం గణనీయంగా వెనక్కి వెళ్లిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సంఘర్షణ ముగిశాక కూడా మేము అనేక ప్రధాన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని గ్రాసీ తెలిపారు. ముఖ్యంగా, ఇరాన్ వద్ద నిల్వ ఉన్న 60 శాతం శుద్ధి చేసిన యురేనియం అత్యంత ఆందోళనకరమని, అది శిథిలాల కిందైనా భద్రంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాడుల తర్వాత కూడా కొన్ని పరికరాలు పనిచేసే స్థితిలో ఉండవచ్చని, తమ ఇన్‌స్పెక్టర్లు (తనిఖీ అధికారులు) అక్కడికి వెళితే తప్ప నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని అన్నారు.

సైనిక దాడుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని తుడిచిపెట్టలేమని గ్రాసీ స్పష్టం చేశారు. "ఒకసారి నేర్చుకున్న విద్యను ఎవరూ మరచిపోలేరు కదా" అని వ్యాఖ్యానించారు. అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించుకునే శాస్త్రీయ, పారిశ్రామిక పునాదులు ఇరాన్‌కు ఉన్నాయని, అత్యంత ఆధునిక సెంట్రిఫ్యూజ్‌లను ఎలా తయారు చేయాలో వారికి తెలుసని వివరించారు. ఇరాన్ విషయంలో తమకు గతంలోనే అనేక అనుమానాలు, సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని గుర్తుచేశారు. "దాచుకోవడానికి ఏమీ లేకపోతే, మాకు చూపించండి" అని ఆయన ఇరాన్‌కు పరోక్షంగా సూచించారు.

ప్రస్తుతం సైనిక చర్య కొనసాగుతున్నందున పునర్నిర్మాణ పనులు జరగడం లేదని, కానీ చాలా వరకు సామర్థ్యం ఇంకా మిగిలే ఉందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తిరిగి చర్చలు అత్యవసరమని ఆయన నొక్కిచెప్పారు.


More Telugu News