హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ శ్లాబు కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్‌బాగ్‌, మెథడిస్ట్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, మూడో అంతస్తులోని తన ఫ్లాట్‌లో ఎలక్ట్రికల్ పనుల కోసం ఇంటి యజమాని దివాకర్ ప్రసాద్ ఇద్దరు ఎలక్ట్రీషియన్లను పిలిపించారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన దేవిదాస్ (56), వివేక్ (32) పనులు చేస్తుండగా, యజమాని దివాకర్ బాల్కనీలో నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో బాల్కనీ శ్లాబు ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురూ కిందపడిపోయారు. 

ఈ దుర్ఘటనలో దేవిదాస్, వివేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన దివాకర్ ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



More Telugu News