అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్' అనే అంశంపై ప్రసంగించారు. ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపిన తన ప్రస్థానాన్ని, రాజకీయంగా ఎదురైన సవాళ్లను, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం తనకున్న దార్శనికతను ఆయన పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనేవి మూడు కీలక స్తంభాలని, వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

బంజరు భూమి నుంచి భాగ్యనగరంగా... 

1995లో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి హైదరాబాద్, సికింద్రాబాద్ అనే జంట నగరాలు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, బిల్ గేట్స్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ విప్లవాన్ని గమనించి, భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీదే అని తాను దృఢంగా విశ్వసించానని తెలిపారు. అప్పట్లో సైబరాబాద్ ప్రాంతం మొత్తం పాములు, ముళ్లపొదలతో నిండిన బంజరు భూమి అని, అక్కడ హైటెక్ సిటీ నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ మొదట వెనుకాడిందని చెప్పారు.

అయితే, వారిని ఒప్పించి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో కేవలం 15 నెలల్లోనే ఆ అద్భుత కట్టడాన్ని పూర్తి చేశామని వివరించారు. ఆ తర్వాత బిల్ గేట్స్‌ను కలిసి, కేవలం 10 నిమిషాల అపాయింట్‌మెంట్‌లో 45 నిమిషాల పాటు చర్చించి, భారతీయుల ప్రతిభను వివరించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పించానని, ఆ రోజు తాను వేసిన పునాది వల్లే ఈ రోజు హైదరాబాద్ ఐటీ హబ్‌గా విలసిల్లుతోందని అన్నారు.

ఐఎస్బీ, విమానాశ్రయం.. హైదరాబాద్‌కు కొత్త రూపు

హైదరాబాద్‌కు ఐఎస్బీని తీసుకురావడానికి తాను పడిన శ్రమను చంద్రబాబు వివరించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కలిసి ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఐఎస్బీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియగానే, తాను వెంటనే వారిని సంప్రదించి హైదరాబాద్‌కు ఆహ్వానించానని తెలిపారు. వారిని ఒప్పించడానికి తన మంత్రివర్గ సహచరులను విమానాశ్రయానికి పంపి, తానే స్వయంగా వారికి అల్పాహారం వడ్డించానని గుర్తు చేసుకున్నారు. 

మిగతా నగరాలు ఇచ్చే ఆఫర్ల కన్నా "బెస్ట్ ప్లస్ వన్" ఇస్తానని ఒక్క మాటతో హామీ ఇచ్చానని, తన చిత్తశుద్ధిని నమ్మి వారే హైదరాబాద్‌లో ఐఎస్బీ ఏర్పాటుకు ముందుకొచ్చారని చెప్పారు. అలాగే, చిన్నగా ఉన్న బేగంపేట విమానాశ్రయానికి ముందుగా ట్రాఫిక్ పెంచి, ఆ తర్వాత 5,000 ఎకరాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా నిర్మించామని తెలిపారు.

అభివృద్ధి చేసినా.. రాజకీయంగా ఎదురుదెబ్బలు 

ఎంత అభివృద్ధి చేసినప్పటికీ, రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమని చంద్రబాబు అన్నారు. 1999 నుంచి 2004 వరకు హైదరాబాద్ అభివృద్ధికి ఎన్నో పనులు చేసినా, 2004 ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని అంగీకరించారు. "అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ (obsession) వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను. కేవలం అభివృద్ధి చేస్తే సరిపోదు, రాజకీయాలను కూడా చూసుకోవాలని ఆ ఓటమి నాకు నేర్పింది" అని ఆయన వ్యాఖ్యానించారు. 

పదేళ్ల తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినా, రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు. 2019లో మరోసారి ఓటమి ఎదురైందని, ఈ అనుభవాలు తనను మరింత రాటుదేల్చాయని తెలిపారు.

విభజన తర్వాత.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా 

2024లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని, ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యం "స్వర్ణాంధ్ర ప్రదేశ్" నిర్మాణమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, దానిని తిరిగి పునర్నిర్మించే పనిలో ఉన్నానని చెప్పారు. గత 21 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, దీని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని వివరించారు. 

గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో భారీ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని, అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్ సిద్ధం చేశామని, వచ్చే 15 ఏళ్ల పాటు ఏటా 15% వృద్ధి రేటు సాధించి, 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని అన్నారు.


అమరావతి, పోలవరం.. ఏపీకి జీవనాధారాలు 

అమరావతి కేవలం రాజధాని కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని, ఇప్పుడు మళ్లీ పనులు వేగవంతం చేశామని తెలిపారు. 

"అమరావతిని హైదరాబాద్ ప్లస్ సిటీగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా నిర్మించి తీరుతా" అని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ మరమ్మతులు పూర్తిచేసి, వచ్చే ఏడాదికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.

సంపద సృష్టితో పాటు.. సమాజ సేవ ముఖ్యం 

పారిశ్రామికవేత్తలు సంపద సృష్టితో పాటు సామాజిక బాధ్యతను కూడా విస్మరించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను గతంలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (P3) మోడల్‌ను ప్రోత్సహించానని, ఇప్పుడు సమాజంలోని అసమానతలను తగ్గించడానికి P4 (People-Public-Private Partnership for Philanthropy) మోడల్‌ను ముందుకు తెస్తున్నానని చెప్పారు. 

"MBK 10-20" అనే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నానని, అంటే "మార్గదర్శి-బంగారం" అని అర్థమని వివరించారు. సమాజంలోని ఉన్నత వర్గాల్లోని 10% మంది, అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. డబ్బు ఇవ్వడమే కాకుండా, వారికి మార్గనిర్దేశం చేసి చేయూతనివ్వడం ద్వారానే నిజమైన సంతృప్తి లభిస్తుందని హితవు పలికారు.


More Telugu News