హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా ప్రదర్శన సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. పంజాగుట్టలోని నెక్స్ట్ గల్లేరియా మాల్‌లో ఉన్న పీవీఆర్ థియేటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే స్క్రీన్‌కు హిందీ, తెలుగు వెర్షన్ల టికెట్లను విక్రయించడమే ఈ రచ్చకు కారణంగా నిలిచింది.

సినిమా ప్రదర్శన మధ్యలో యాడ్స్ వస్తున్న సమయంలో స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. దీంతో హిందీ, తెలుగు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. 'మేము తెలుగు వెర్షన్ టికెట్లు ముందుగా బుక్ చేసుకున్నాం' అని ఓ మహిళ గట్టిగా నిలదీయగా, మరికొందరు మేం హిందీ వెర్షన్ కు టికెట్లు కొన్నాం... మెట్లపై కూర్చునే సినిమా చూస్తామంటూ ఆందోళనకు దిగారు. దీంతో థియేటర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు థియేటర్ సిబ్బంది, పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత యాజమాన్యం హిందీ వెర్షన్‌ను ప్రదర్శించాలని నిర్ణయించింది. దీంతో తెలుగు టికెట్లు కొన్న ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను ఓ నెటిజన్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రం మార్చి 19న విడుదలైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 501 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ల తప్పిదాల వల్ల ఇలాంటి ఘటనలు జరగడం ప్రేక్షకుల అనుభూతిని దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News