భారత్ కోసం ఐర్లాండ్ పర్యటన రద్దు.. కానీ టీమిండియా సిరీస్‌పై వీడని సందిగ్ధత

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన తమ ఐర్లాండ్ పర్యటనను వాయిదా వేసింది. అదే సమయంలో భారత జట్టుతో స్వదేశంలో వైట్-బాల్ సిరీస్ ఆడేందుకు బీసీబీ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు భారత్‌తో సిరీస్ కోసం షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే, ఇరు దేశాల మధ్య ఇటీవల నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి లభించలేదు. దీంతో బంగ్లా ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

బీసీబీ విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం... భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, ఆ తర్వాత సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ సిరీస్ గతేడాది జరగాల్సి ఉండగా, ఈ సెప్టెంబర్‌కు మార్చారు. దీంతో అదే సమయంలో ఉన్న ఐర్లాండ్ పర్యటనను వాయిదా వేయాలని బీసీబీ నిర్ణయించుకుంది.

ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ... "భారత్‌తో సిరీస్ ఖరారు కావడంతో ఐర్లాండ్ పర్యటనను 2026లో మరో సమయంలో నిర్వహించగలరా? అని క్రికెట్ ఐర్లాండ్‌ను కోరాము. కానీ, వారు అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ పర్యటన వాయిదా పడింది. బహుశా వచ్చే ఏడాది (2027) ఈ సిరీస్‌కు కొత్త విండోను కనుగొంటాం" అని తెలిపారు.

అనుమతిపై అనిశ్చితి ఎందుకు?
ఇటీవల ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. ఫలితంగా ఆ టోర్నమెంట్‌కే దూరమైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు భారత జట్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించే విషయంపై సందిగ్ధత నెలకొంది.

ఇదిలా ఉంటే... బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందని ఆరోపిస్తోంది. బోర్డు ఎన్నికల ప్రక్రియపై విచారణకు జాతీయ క్రీడా మండలి ఒక కమిటీని ఏర్పాటు చేయడాన్ని బీసీబీ తప్పుబట్టింది. ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో అనధికారికంగా చర్చలు జరిపినట్లు కూడా బీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం తమది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన బోర్డు అని, తమ కార్యకలాపాల్లో జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య భారత్‌తో సిరీస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


More Telugu News