అమెరికా మాపై దాడి చేస్తే, మేం భారత్‌ పై బాంబులు వేస్తాం: పాక్ మాజీ రాయబారి

పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా తమ దేశంపై దాడి చేస్తే, అందుకు ప్రతీకారంగా తాము భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబు దాడులకు దిగుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ‘‘అమెరికా మాపై దాడి చేస్తే, మేం వెంటనే భారత్‌పై దాడి చేయాలి. ముంబై, ఢిల్లీలను వదిలిపెట్టం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నారు. తమ దేశ అణు సంపదను లక్ష్యంగా చేసుకున్నా ఇదే తరహా ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. అయితే, ఇది దాదాపు అసాధ్యమైన సందర్భమని అంగీకరిస్తూనే, దీనిని ‘వ్యూహాత్మక ఉన్మాదం’గా అభివర్ణించడం గమనార్హం.

2014 నుంచి 2017 వరకు భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా పనిచేసిన బాసిత్ నుంచి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో భారత్‌ను అనవసరంగా వివాదంలోకి లాగుతూ బాసిత్ మాట్లాడటంపై సోషల్ మీడియాలో భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.

పాక్ అధికారులకు తమ సమస్యలను పక్కనపెట్టి భారత్‌ను బెదిరించడం అలవాటుగా మారిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.


More Telugu News