‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ

ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని కీలకమైన డిమోనా, ఆరాద్ నగరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసినట్లుగా క్షిపణులు దూసుకురావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడగా, వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. భారీ వార్‌హెడ్‌లతో కూడిన క్షిపణులు నేరుగా నివాస ప్రాంతాలపై పడటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి.

ఈ దాడిలో ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే వైమానిక రక్షణ కవచం పూర్తిగా విఫలమైంది. క్షిపణులను అడ్డుకోలేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా, దాడి జరిగిన డిమోనా నగరాన్ని 'లిటిల్ ఇండియా' అని కూడా పిలుస్తారు. ఇక్కడ వేలాది మంది భారత సంతతికి చెందిన యూదులు నివసిస్తుండటమే దీనికి కారణం. తమ కళ్ల ముందే క్షిపణులు పడటంతో వారు భయంతో వణికిపోయారు. తమ నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. రాబోయే 48 గంటల్లోగా ఇరాన్ తన దూకుడును ఆపి, హర్మూజ్ జలసంధిని వాణిజ్యానికి తెరవాలని, లేకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ (IAEA) స్పందిస్తూ.. డిమోనా అణు కేంద్రానికి ఎలాంటి రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే, ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. 


More Telugu News