Sunil Gavaskar: పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్

Sunil Gavaskar Defends Remarks on Pakistan Player Purchase
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, పాకిస్థాన్ క్రికెటర్ల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కాగా, వాటిని గట్టిగా సమర్థించుకున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్‌లో ఓ భారత యాజమాన్యంలోని ఫ్రాంచైజీ పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన, ఆసియా కప్ వంటి టోర్నీల్లో పాకిస్థాన్ షోలలో తాను కనిపించడంపై వస్తున్న విమర్శలకు స్పష్టమైన వివరణ ఇచ్చాడు. 

ఇటీవల జరిగిన 'ది హండ్రెడ్' లీగ్ వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు, పాక్‌ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ కొనుగోలుపై గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. "పాకిస్థానీ ఆటగాడికి చెల్లించే ఫీజు, ఆ దేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళుతుంది. ఆ డబ్బుతో కొన్న ఆయుధాలు భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. చెల్లింపులు చేస్తున్నది భారత సంస్థ అయినా, దాని విదేశీ అనుబంధ సంస్థ అయినా, యజమాని భారతీయుడు అయితే, మన ప్రాణనష్టానికి దోహదం చేసినట్లే" అని ఆయన తన కాలమ్‌లో పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల సందర్భంగా పాకిస్థాన్ ప్రసారాల ప్యానెళ్లలో గవాస్కర్ కూడా పాల్గొంటారని, ఆ టోర్నీల ఆదాయంలో పాకిస్థాన్‌కు కూడా వాటా వెళుతుంది కదా అని కొందరు ప్రశ్నించారు. ఈ విమర్శలపై గవాస్కర్ స్పందిస్తూ.. "అవును, నేను ఐసీసీ, ఏసీసీ కామెంట్రీ ప్యానెళ్లలో ఉన్నాను. వాటి ద్వారా వచ్చే ఆదాయం అన్ని దేశాలకు పంపిణీ అవుతుంది. కానీ, నాకు తెలిసి ఏ భారతీయ సంస్థ నుంచీ నేరుగా పాకిస్థాన్‌కు డబ్బు వెళ్లడం లేదు" అని స్పష్టం చేశాడు.

"నేను ఏ కామెంటేటర్‌కూ, భారతీయుడైనా, విదేశీయుడైనా, చెల్లింపులు చేయడం లేదు. అలాంటప్పుడు నేను ఎలా బాధ్యుడిని అవుతాను?" అని స‌న్నీ ప్రశ్నించాడు. తన అభిప్రాయాన్ని మరింత గట్టిగా వినిపిస్తూ, "భారతీయులు పాకిస్థానీలకు చెల్లించడం ఆపేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దశాబ్దాలుగా పాకిస్థానీలు మనకు చెల్లించడం ఎప్పుడూ జరగలేదని గమనించండి" అని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Sunil Gavaskar
Pakistan
The Hundred League
Asia Cup
Abrar Ahmed
India Pakistan relations
terrorism
commentary panel
tax revenue
sports

More Telugu News