ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు.. విశాఖకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల తయారీ రంగం అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో భారీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్ఐపీ) సంస్థ ఈ యూనిట్‌ను స్థాపించనుండగా, ఇందుకోసం మొత్తం రూ.2,387.81 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

ఈ ప్రాజెక్టు కోసం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024–29 కింద ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎకరా భూమిని కేవలం ఒక్క రూపాయికే కేటాయించారు.

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో రూ.547.09 కోట్లు, రెండో దశ విస్తరణకు సుమారు రూ.1,840 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశ పనులను 2027 జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' (ఐఎస్ఎం) కింద ఆంధ్రప్రదేశ్‌లో అనుమతి పొందిన తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఈ యూనిట్ ఏర్పాటుకు దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఏసీటీ కో లిమిటెడ్) సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రెండో దశలో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్లికేషన్ల కోసం అవసరమైన అత్యాధునిక ప్యాకేజింగ్ టెక్నాలజీపై దృష్టి సారించనున్నారు. ఈ భారీ పరిశ్రమ రాకతో విశాఖ నగరం దేశీయ సెమీకండక్టర్ పటంలో కీలక స్థానాన్ని సంపాదించుకోనుంది.


More Telugu News