మత్స్యకారుల వివాదంతో నాకు సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేస్తే సహించను: బీదా మస్తాన్ రావు

తమిళనాడు బోట్ల వ్యవహారంలో తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు తీవ్రంగా ఖండించారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన... మత్స్యకారుల మధ్య జరుగుతున్న వివాదంతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి తాను ఏ అధికారితో కానీ, గ్రామస్థులతో కానీ మాట్లాడలేదని, కావాలనే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించే తనపై ఇలాంటి ఆరోపణలు రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, తాను కూడా ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ వివాదాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తన జీవితంలో మత్స్యకార గ్రామాల గౌరవానికి భంగం కలిగించే పని ఏనాడూ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని ఆయన తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలు తెలుసుకోకుండా చేసే దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.



More Telugu News