జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల కవరేజీలో ఉన్న జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రష్యా టుడే (ఆర్టీ) ఛానెల్‌కు చెందిన ఓ రిపోర్టర్, కెమెరా ఆపరేటర్ రిపోర్టింగ్ చేస్తుండగా, వారికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ క్షిపణి పేలింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే, ఆర్టీ కరస్పాండెంట్ స్టీవ్ స్వీనీ, కెమెరా ఆపరేటర్ అలీ రిదా స్బైటీ.. దక్షిణ లెబనాన్‌లోని లిటాని నదిపై ఉన్న అల్-ఖస్మియా వంతెన వద్ద ఇజ్రాయెల్ దాడులను కవర్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు ప్రెస్ అని స్పష్టంగా కనిపించే జాకెట్లను ధరించి ఉన్నారు. ఇంతలోనే ఓ క్షిపణి పెద్ద శబ్దంతో వారి పక్కనే కూలిపోయింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవగా, వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. తమపై జరిగిన దాడి ఉద్దేశపూర్వకమేనని గాయపడిన కెమెరామెన్ సైతం ఆరోపించారు.

మరోవైపు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ దాడిని ధృవీకరించింది. ఆ వంతెనను ఆయుధాల రవాణాకు ఉపయోగిస్తున్నారని, అందుకే దాడులు నిర్వహించామని తెలిపింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పౌరులకు ముందుగానే స్పష్టమైన హెచ్చరికలు చేశామని, తాము పౌరులను గానీ, జర్నలిస్టులను గానీ లక్ష్యంగా చేసుకోమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరపాలని జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ (సీపీజే) డిమాండ్ చేసింది.



More Telugu News