యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!

ఫిబ్రవరి 28న మొదలైన పశ్చిమాసియా యుద్ధం కేవలం మూడు దేశాలకే పరిమితం కాలేదు. దాని సెగ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ వంటి 'హర్మూజ్ జలసంధి'లో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ‘ఎన్డీటీవీ’ తన ఎక్స్‌క్లూజివ్ కథనంలో సంచలన గణాంకాలను వెల్లడించింది.

నిశ్శబ్దమైన సముద్ర మార్గం
ఒకప్పుడు నిత్యం 100కు పైగా నౌకలతో కళకళలాడే హర్మూజ్ జలసంధి ఇప్పుడు వెలవెలబోతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో రోజుకు సగటున 83 నౌకలు ప్రయాణించగా, ఈ ఏడాది యుద్ధానికి ముందు ఆ సంఖ్య 106కు చేరింది. కానీ, యుద్ధం మొదలైన తర్వాత మార్చి మొదటి వారం నాటికి ఇది కేవలం 6 నౌకలకు పడిపోవడం గమనార్హం. ఈ మార్గం మూతపడటంతో సహజ వాయువు (Natural Gas) ధరలు ఒక్కసారిగా 10 శాతం పెరిగి, యూనిట్‌కు 3.2 డాలర్లకు చేరుకున్నాయి.
   
దేశాల వారీగా ఇంధన మంట
ఎన్డీటీవీ సేకరించిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 మధ్య పెట్రోల్ ధరలు ఆస్ట్రేలియాలో 32 శాతం, అమెరికాలో 24 శాతం, సింగపూర్‌లో 21 శాతం మేర పెరిగాయి. డీజిల్ ధరల పరిస్థితి మరీ దారుణం. ఆస్ట్రేలియాలో అత్యధికంగా 40 శాతం పెరుగుదల నమోదు కాగా, సింగపూర్ (34 శాతం), అమెరికా (33 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో ప్రభుత్వ నియంత్రణ వల్ల ధరలు స్థిరంగా ఉండటం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.
   
వంటగ్యాస్ నుంచి విమాన ప్రయాణం దాకా
వంటగ్యాస్ (LPG) ధరల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గ్రీస్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఎల్పీజీ ధరలు ఆకాశాన్ని తాకగా, రష్యా, సౌదీ వంటి ఉత్పత్తి దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ఇక విమాన ప్రయాణికులపై కూడా ఈ భారం పడింది. విమాన ఇంధన ధరలు పెరగడంతో ఎయిర్ ఇండియా (రూ. 399), ఇండిగో (రూ. 425) వంటి సంస్థలు ఇప్పటికే 'ఫ్యూయల్ సర్ఛార్జ్'ను విధిస్తున్నాయి. ఆకాశ ఎయిర్ అయితే ఏకంగా రూ. 1,300 వరకు అదనపు భారాన్ని మోపుతోంది.
    
భారత్‌లో వంటగ్యాస్ ధర పెంపు
ఎన్డీటీవీ పేర్కొన్నట్టుగానే, అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో భారత్‌లో కూడా ప్రభావం మొదలైంది. మార్చి 7 న దేశీయ వంటగ్యాస్ (LPG) సిలిండర్ ధరపై కేంద్రం రూ. 60 మేర పెంచింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913కి చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం గమనార్హం.   


More Telugu News