ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ఉత్పత్తి పూర్తిగా బంద్.. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో కూడా ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారు అయిన ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపివేసింది. తాజా పరిణామాలతో హార్ముజ్ జలసంధి యుద్ధ క్షేత్రంగా మారింది. ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా జరిగే ఈ మార్గంలో దాడుల భయంతో రాకపోకలు దాదాపుగా స్తంభించిపోయాయి. దీంతో 700కు పైగా కార్గో నౌకలు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో నిలిచిపోయాయి.

భారత్‌పై తీవ్ర ప్రభావం
పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో దాదాపు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచే సమకూర్చుకుంటోంది. ఇందులో ముఖ్యంగా ఖతార్ నుంచి 40 శాతం ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంటోంది. అంటే, మన దేశ మొత్తం గ్యాస్ అవసరాల్లో దాదాపు 20 శాతం ఖతార్ నుంచే వస్తోంది.

ఇంధన రంగ నిపుణుడు కిరీట్ పారిఖ్ ప్రకారం.. "ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారత్ తన గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో గ్యాస్ వాడకంపై కోతలు విధించాల్సిన అవసరం ఏర్పడుతుంది" అని వివరించారు.

ప్రస్తుతం భారత్‌లో రోజువారీ గ్యాస్ వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా (ఎంఎంఎస్‌సీఎండీ) ఉంది. ఇందులో దేశీయంగా 97.5 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలినది దిగుమతులపైనే ఆధారపడి ఉంది. గత వారం నాటికి, ఫోర్స్ మేజర్ పరిస్థితుల కారణంగా 47.4 ఎంఎంఎస్‌సీఎండీ సరఫరాలు నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఎల్‌ఎన్‌జీ కార్గోల కోసం కొత్తగా ఆర్డర్లు ఇచ్చాయి. అయితే, పెరుగుతున్న ధరలు, సరఫరాలో అంతరాయాల కారణంగా భారత్‌కు ఇంధన కష్టాలు తప్పేలా లేవు.


More Telugu News