Chandrababu: దివ్యాంగుల ఆత్మగౌరవమే లక్ష్యం.. ఏపీలో 'దివ్యాంగశక్తి' పథకం ప్రారంభం

Divyangashakti Scheme Launched for Disabled in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచుతూ, వారి సాధికారతకు బాటలు వేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగశక్తి' పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి రాజధాని ప్రాంతంలోని పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల పాటు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ పథకం ద్వారా 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులతో పాటు వారి సహాయకులకు ప్రయాణ ఛార్జీలో 50 శాతం రాయితీ కల్పించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 12.76 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. పథకం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు తన నివాసంలో పలువురు దివ్యాంగులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి, వారితో కలిసి భోజనం చేశారు.

దివ్యాంగులకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... "దివ్యాంగులంటే విభిన్న ప్రతిభావంతులు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సాధికారత సాధించేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. కేవలం సాయం అందించడమే కాకుండా, వారి ఖర్చులను తగ్గించి గౌరవాన్ని పెంచడంపైనే దృష్టి సారించాం. గతంలో రూ.500గా ఉన్న పింఛన్‌ను మేమే దశలవారీగా పెంచాం. ఇప్పుడు రూ.6,000 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంతో వారికి నెలకు సుమారు రూ.2,000 వరకు ఆదా అవుతుంది" అని వివరించారు.

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే దివ్యాంగుల పింఛన్ పెరిగిందని, 'దివ్యాంగశక్తి' వంటి పథకాలు అమలవుతున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. "గత ప్రభుత్వం దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పింఛన్ పెంచలేదు. అంతేకాకుండా, దివ్యాంగుల కోటాలో అర్హత లేని వారు కూడా ఉద్యోగాలు, పింఛన్లు పొందడం బాధాకరం. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీఎం స్పష్టం చేశారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన 'స్త్రీశక్తి' పథకం ద్వారా ఇప్పటికే 52 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, అదే స్ఫూర్తితో 'దివ్యాంగశక్తి' కూడా విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలి: దివ్యాంగులు
ముఖ్యమంత్రి ఇచ్చిన విందులో పాల్గొన్న దివ్యాంగులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రూ.6,000 పింఛన్‌తో పాటు ఇప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ లాంటి వారికి అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొందరు దివ్యాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగుల ముసుగులో కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు పొందుతున్నారని, దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపి అనర్హులను ఏరివేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
Go Back to Shorts
Chandrababu
Divyangashakti Scheme
Andhra Pradesh
Differently Abled
Free Bus Travel
RTC
Pawan Kalyan
Nara Lokesh
Disability Pension
APSRTC

More Telugu News