నెతన్యాహు ఎక్కడ? ప్రధానిపై వదంతులతో ఇజ్రాయెల్‌లో కలకలం

ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న కీలక సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తుండటంతో ఇజ్రాయెల్‌లో గందరగోళం నెలకొంది.

నెతన్యాహు మరణించినట్లు చూపిస్తున్న కొన్ని ఫొటోలు ఎక్స్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఇవి ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ చిత్రాలని సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. ఈ వదంతులకు నెతన్యాహు కుమారుడు యాయీర్ నెతన్యాహు మౌనం మరింత బలాన్నిస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే యాయీర్, గత వారం రోజులుగా ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో అనుమానాలు పెరిగిపోయాయి.

ఈ తప్పుడు ప్రచారం వెనుక ఇరాన్ హ్యాకర్లు లేదా వారి ప్రచార విభాగం హస్తం ఉండవచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. యుద్ధ సమయంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఈ కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఇటీవల ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పుకార్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. భద్రతా కారణాల రీత్యా ప్రధాని కదలికలను అత్యంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఆయన్ను సురక్షితమైన భూగర్భ బంకర్‌కు తరలించి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెతన్యాహు స్వయంగా ఓ వీడియో సందేశం విడుదల చేస్తేనే ఈ వదంతులకు తెరపడే అవకాశం ఉంది.


More Telugu News