Chandrababu Naidu: ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu AP gets additional 24000 metric tons LPG
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రాష్ట్రానికి అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వచ్చిందని, గ్యాస్ నిల్వలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా, పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ వంటి కీలక అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉండగా, తాజాగా విశాఖలో అదనపు స్టాక్ చేరడంతో సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎం భరోసా ఇచ్చారు. ఈకేవైసీ, ఓటీపీల సాయంతో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయాన్ని ప్రస్తుతం ఉన్న దానికంటే తగ్గించి, కేవలం 1.5 రోజుల్లో వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ కొరత రాకుండా చూడాలని, ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌ల లభ్యతను కూడా పరిశీలించాలని సూచించారు.

పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ విస్తరణే లక్ష్యం

ఎల్పీజీ సరఫరాను పర్యవేక్షిస్తూనే, దీనికి శాశ్వత ప్రత్యామ్నాయంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్వర్క్‌ను మరింతగా విస్తరించడం ద్వారా ప్రజలపై భారం తగ్గించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజల ఇళ్లకు చేర్చడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్ జీ) వినియోగాన్ని గరిష్ఠంగా పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. గతంలో ఎల్ఎన్జీని ఏపీకి కేటాయించుకుని, రెండు సీజన్లలో పైప్ లైన్ ద్వారా కొండపల్లి వరకు తీసుకురాగలిగామని సీఎం గుర్తు చేశారు. తక్కువ వ్యయంతో కూడిన ఇంధనాన్ని వినియోగదారులకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏజీ అండ్ పీ, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్, జీజీపీఎల్, ఐఓసీఎల్, మెఘా గ్యాస్ వంటి సంస్థలు 198 సీఎన్జీ స్టేషన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నాయని, 1.68 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇచ్చే మౌలిక సదుపాయాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, అమరావతితో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ నెట్వర్క్‌ను భారీగా విస్తరించేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సహకరించేలా పెట్రోలియం కంపెనీలతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.

‘ఏపీ వన్’ యాప్‌తో సత్వర సేవలు

ఈ సమీక్షలో కేవలం ఇంధన అంశాలకే పరిమితం కాకుండా, పలు పాలనాపరమైన అంశాలపైనా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని, వారికి సంక్షిప్త సందేశాలు పంపాలని సూచించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం రూపొందిస్తున్న ‘ఏపీ వన్ యాప్’ను త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వ శాఖలు ‘డేటా లేక్’, ‘అవేర్’ వేదికలను ఏ మేరకు వినియోగించుకుంటున్నాయో గుర్తించి, వేసవిలో తాగునీరు, వడగాల్పులు, పశుగ్రాసం వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మహిళలపై నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఐఅండ్‌ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు, గెయిల్, ఓఎన్జీసీ, వివిధ పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
LPG
Gas shortage
Piped gas network
CNG
PNG
AP One App
Sai Prasad
Krishna Babu

More Telugu News