జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన

జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని, అలాంటి వ్యక్తితో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా మాట్లాడాలని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్‌లో టీపీసీసీ చీఫ్ బాధ్యత తీసుకోవాలని అన్నారు.

జీవన్ రెడ్డి తమ సీనియర్ నాయకుడని, తన తండ్రి సమకాలీకుడని తెలిపారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని అన్నారు. అలాంటి నాయకుడు గురించి పార్టీ సీరియస్‌గా ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. ఎవరికో చెప్పి మాట్లాడిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఆయనతో స్నేహం ఉండటం వేరని, కానీ పార్టీ మారే అంశంపై చొరవ తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షుడే అని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై కూడా ఆయన స్పందించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది ఏఐసీసీ చూసుకుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా జగ్గారెడ్డి పేరును ప్రస్తావించడంపై స్పందిస్తూ, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు అన్నారు.

శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్లు మరో ఐదేళ్లు అధికారంలో ఉండాలని అనుకోవడంలో తప్పేముందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు రావాలని సూచించారు. పార్టీలో కోఆర్డినేషన్ కమిటి కొత్తేమీ కాదని, కోఆర్డినేషన్ కోసమే దానిని వేస్తారని అన్నారు.


More Telugu News