డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం... కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

తెలంగాణ శాసనమండలి వేదికగా డ్రగ్స్ వ్యవహారంపై ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్ విచ్చలవిడిగా దొరకడానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని ఆయన ధ్వజమెత్తారు.


రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్ల మాదిరి డ్రగ్స్ లభిస్తున్నాయని, కొందరు నాయకులు స్వయంగా డ్రగ్స్ వ్యాపారం చేయడం సిగ్గుచేటని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. డ్రగ్ టెస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని... మరి ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ ముందుకు వస్తారా? అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. "మీరు అంగీకరిస్తే రేపే ముహూర్తం పెడదాం, ముఖ్యమంత్రిని ఒప్పించే బాధ్యత నాది" అని సవాల్ చేశారు. ప్రజాప్రతినిధులందరూ పరీక్షలు చేయించుకుని సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని కోరారు.


కాంగ్రెస్ తరపున బీ-ఫామ్స్ అందుకున్న వారందరినీ తాము టెస్టులకు తీసుకువస్తామని, అదే ధైర్యం ఉంటే బీఆర్ఎస్ కూడా వారి సభ్యులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అని ప్రశ్నిస్తూ, డ్రగ్స్ మాటెత్తగానే బీఆర్ఎస్ నాయకుల పేర్లే ఎందుకు బయటకు వస్తున్నాయని నిలదీశారు. పదేళ్లలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా విచ్చలవిడిగా జరిగిందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే పార్టీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఈగల్ టీమ్'ను ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారని, గతంలో టెస్టులకు భయపడి పారిపోయిన వారు ఎవరో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయడం, మరోవైపు మండలిలో మహేశ్ కుమార్ గౌడ్ విసిరిన ఈ 'డ్రగ్ టెస్ట్' ఛాలెంజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.



More Telugu News