మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్

  • బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమ్రాన్ అక్మల్
  • నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకుంటుందని ఎద్దేవా

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోవడంపై అక్మల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.


"పాకిస్థాన్ జట్టు ప్రస్తుత ఆటతీరు చూస్తుంటే... నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్ట్ హోదా దక్కించుకునేలా ఉంది. మీరు మైదానంలో ప్రత్యర్థి జట్లను ఓడించి గెలవలేకపోతే, ఇకపై ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే" అంటూ అక్మల్ తన దేశ జట్టుపై ఘాటుగా విమర్శలు గుప్పించాడు. 


ఆసియా కప్ - 2025 విజేతగా నిలిచిన టీమ్ ఇండియా, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకుపోయారు. ఆ ట్రోఫీని నేటికీ నఖ్వీ తన కార్యాలయంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. ఈ చర్య వల్ల నఖ్వీ క్రీడా ప్రపంచంలోనే అత్యంత తీవ్ర అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 'ట్రోఫీ చోర్' అంటూ భారత నెటిజన్లు ఆయనను అప్పట్లో ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే పాక్ జట్టును అక్మల్ విమర్శిస్తూ... "మనం ట్రోఫీలను దొంగిలించాల్సిందే" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Kamran Akmal
Pakistan Cricket
ICC Trophy
Mohsin Naqvi
Asia Cup 2025
Trophy Chor
Cricket News
Pakistan Cricket Team
Bangladesh Cricket
PCB Chairman

More Telugu News