Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరైన అనంతబాబు భార్య
ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తూ, ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఆమె ఈరోజు సిట్ ముందు హాజరయ్యారు.
ఈ హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని, బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని లక్ష్మీదుర్గ గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కానీ సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన సిట్ అధికారులు, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని తేల్చారు.
హత్య జరిగిన రాత్రి ఆమె అనంతబాబుతో కలిసే ఉన్నట్లు, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసే సమయంలో కూడా ఆమె పాత్ర ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను నిందితురాలిగా చేరుస్తూ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆమె ఈరోజు విచారణకు హాజరయ్యారు.