Jai Shah: సంస్థ కంటే ఏ జట్టూ ఎక్కువ కాదు.. టీ20 వరల్డ్ కప్‌ వివాదాలపై జై షా ఘాటు వ్యాఖ్యలు!

Jai Shah comments on T20 World Cup controversies
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న తీవ్ర ఉత్కంఠ, రాజకీయ పరిణామాలపై ఐసీసీ ఛైర్మన్ జై షా తొలిసారి నోరు విప్పారు. ముంబైలో జరిగిన 'ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కొన్ని జట్లు టోర్నీకి దూరం కావడం వల్ల ఈవెంట్ భవితవ్యం ప్రశ్నార్థకమైన తరుణంలో ఐసీసీ తీసుకున్న కఠిన నిర్ణయాలను సమర్థించుకున్నారు. ఏ ఒక్క జట్టూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కంటే పెద్దది కాదని ఆయన స్పష్టం చేశారు.

భద్రతా కారణాల సాకుతో భారత్‌కు ప్రయాణించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడం, ఫలితంగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. బంగ్లాకు మద్దతుగా తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినా, ఆ తర్వాత వెనక్కి తగ్గి టోర్నీలో పాల్గొంది. ఈ పరిణామాలపై స్పందిస్తూ.. "ఒక సంస్థ అంటే అన్ని జట్ల కలయిక. ఏ ఒక్క జట్టు సంస్థను శాసించలేదు" అని జై షా పరోక్షంగా చురకలు అంటించారు.

వివాదాల మధ్య మొదలైనప్పటికీ ఈ వరల్డ్ కప్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిందని జై షా వెల్లడించారు. ఒకే సమయంలో సుమారు 7.2 మిలియన్ల మంది డిజిటల్ వ్యూయర్స్ టోర్నీని వీక్షించడం ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. అసోసియేట్ జట్లైన నేపాల్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి దేశాలు దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇవ్వడం క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన అభినందించారు.

వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లను ఉద్దేశించి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. "శిఖరాగ్రం నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలు, కానీ మళ్లీ పైకి ఎదగడానికి ఏళ్లు పడుతుంది. కష్టపడటం ఆపకండి" అని హితవు పలికారు. 2028 ఒలింపిక్స్ కోసం తాను బీసీసీఐలో ఉన్నప్పుడే ప్రణాళికలు వేశానని, ఇప్పుడు జట్టు 2031, 2036 లక్ష్యంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Jai Shah
T20 World Cup
ICC
BCCI
Cricket
Bangladesh
Pakistan
Suryakumar Yadav
Gautam Gambhir
Cricket World Cup

More Telugu News