విడాకుల తర్వాత హీరోయిన్ హన్సిక తొలి స్పందన

  • వైవాహిక బంధానికి ముగింపు పలికిన హన్సిక
  • ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ ట్వీట్
  • సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్న హన్సిక

సినీ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు సోహైల్ కతూరియాను 2022 డిసెంబర్‌లో ఘనంగా వివాహం చేసుకున్న హన్సిక, కేవలం నాలుగేళ్లకే ఆ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. మార్చి 11న కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.


విడాకుల అనంతరం హన్సిక సోషల్ మీడియాలో పెట్టిన మొదటి పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబీ భాషలో ‘చార్దీ కలా..’ అనే పదాన్ని ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఏలాంటి కష్టకాలంలోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ఎప్పుడూ ఉత్సాహంతో నిరంతరం ముందుకు సాగాలని దీని అర్థం. జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి, కొత్త ఆశలతో ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.


గతంలో వీరి వివాహ వేడుకను ఒక డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే గతేడాది నుంచే వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. హన్సిక తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లి ఫొటోలను తొలగించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు చట్టబద్ధంగా విడాకులు రావడంతో ఆమె తిరిగి తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.



More Telugu News