IAF Wing Commander: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఆత్మహత్య.. ఛత్తీస్ గఢ్ లో ఘటన

IAF Wing Commander Vipul Yadav Suicide Raipur Chhattisgarh
  • ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న అధికారి
  • కుటుంబ కలహాలే కారణమని సందేహాలు
  • మరో గదిలో నిద్రించిన ఇద్దరు పిల్లలు
  • ఉదయం పనిమనిషి వచ్చాకే బయటపడ్డ దారుణం
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వింగ్ కమాండర్ విపుల్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ లోని తన సొంత నివాసంలో మంగళవారం ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయారు. ఆ సమయంలో ఆయన భార్య ఇంట్లో లేదని, ఇద్దరు పిల్లలు మరో గదిలో నిద్రిస్తున్నారని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం పనిమనిషి వచ్చాకే ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఐఏఎఫ్ లో వింగ్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న విపుల్ యాదవ్ ను యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా ఆయన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. విపుల్ యాదవ్ భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఈ దంపతులకు 9, 7 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి పిల్లలు ఇద్దరూ మరో గదిలో పడుకోగా, విపుల్ తన గదిలో నిద్రించారు. ఆయన భార్య తన విధుల్లో భాగంగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి విపుల్ యాదవ్ గది శుభ్రం చేయడానికి తలుపు తెరిచింది.

గదిలో విపుల్ యాదవ్ ఫ్యాన్ కు వేలాడుతుండడం చూసి ఇరుగుపొరుగును అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. విపుల్ యాదవ్ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాల వల్లే విపుల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎలాంటి సూసైడ్ లెటర్ దొరకలేదని పేర్కొన్నారు.
IAF Wing Commander
Vipul Yadav
Suicide
Chhattisgarh
Raipur
Indian Air Force
Anti Naxal Operation
Family Dispute

More Telugu News