మాంసం తిన్న పూజారి.. చితకబాదిన జనాలు

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర అపచారం
  • పూజారి మాంసం తింటున్న ఫొటోలు వైరల్
  • పూజారిని విధుల నుంచి తొలగించిన వైనం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక గుడి పూజారి మాంసం తింటున్నట్లు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేశవపురంలోని ప్రసిద్ధ శ్రీ భూతేశ్వర్ ధామ్ ఆలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు సదరు పూజారిని విధుల నుంచి తొలగించే వరకు వెళ్ళింది.


వివరాల్లోకి వెళితే... ఆలయ ప్రాంగణంలోని ఒక గదిలో నివసిస్తూ పూజలు చేసే ప్రశాంత్ గిరి (గోలు పండిట్), ఒక రెస్టారెంట్‌లో మాంసాహారం తింటున్నట్లున్న ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఇది చూసిన స్థానికులు, భక్తులు ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి సుమారు 50 నుండి 60 మంది వ్యక్తులు గుడి వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు.


నిరసనకారులు ప్రశాంత్ గిరిని గుడి బయటకు లాగి విచక్షణారహితంగా చితకబాదారు. ఈ క్రమంలో ఆయన భార్య, కోడలు అడ్డుకోగా, వారిపై కూడా గుంపు దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రావత్‌పూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, పూజారిని కోపోద్రిక్తులైన జనం నుండి రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ప్రశాంత్ గిరి ఆచూకీ గురించి స్పష్టత లేదు.


ఈ ఘటనపై ఆలయ ప్రధాన పూజారి (మహంత్), ప్రశాంత్ గిరి తండ్రి అయిన సంతోష్ గిరి స్పందిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. "నేను ఈ ఆలయ మహంత్‌ని. నా కుమారుడు మాంసాహారం సేవించిన విషయం తెలియగానే అతన్ని వెంటనే ఆలయ సేవల నుండి బహిష్కరించాను" అని ప్రకటించారు. తన కుమారుడిపై జరిగిన దాడిని ఖండిస్తూనే, మతపరమైన మనోభావాలను గౌరవిస్తానని ఆయన తెలిపారు.


మరోవైపు, ఇది ఒరిజినల్ ఫొటో కాదని, తనను ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు మార్ఫింగ్ చేసిన ఫొటోను వైరల్ చేశారని గిరి చెప్పడం గమనార్హం.


More Telugu News