13 ఏళ్లుగా అచేతన స్థితిలో యువకుడు.. కారుణ్య మరణంపై నేడు సుప్రీం తీర్పు

  • 2013లో ప్రమాదానికి గురైన హరీశ్ రాణా
  • అప్పటి నుంచి జీవచ్ఛవంలా బెడ్‌పైనే
  • రాణా కోలుకునే అవకాశాలు దాదాపు శూన్యమని తేల్చిన వైద్యుల బృందం
  • ప్రాణాధార వైద్య పరికరాలు తొలగించేందుకు అనుమతి కోరిన కుటుంబం
  • గౌరవంగా మరణించే హక్కు కోసం సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ 
13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న ఓ యువకుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు (బుధవారం) కీలక తీర్పు వెలువరించనుంది. ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా అనే యువకుడికి అందిస్తున్న ప్రాణాధార వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతి ఇవ్వాలని అతడి కుటుంబం కోరుతోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం నేడు (మార్చి 11) తుది తీర్పును ప్రకటించనుంది.

విద్యార్థిగా ఉన్నప్పుడు 2013లో హరీశ్ రాణా నాలుగో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి దాదాపు 13 ఏళ్లుగా అతడు మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసున్న రాణా 100 శాతం అంగవైకల్యంతో జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. శ్వాస కోసం, ఆహారం కోసం ట్యూబుల సహాయం తప్పనిసరి అయ్యింది.

ఈ కేసు విచారణ సందర్భంగా నిష్క్రియాత్మక కారుణ్య మరణం (passive euthanasia)పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాణా పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాణా ఇంటికి వెళ్లి పరీక్షించిన వైద్య బృందం.. అతడు కోలుకునే అవకాశాలు దాదాపు శూన్యమని నివేదిక ఇచ్చింది. అనంతరం, ఢిల్లీ ఎయిమ్స్‌తో మరో స్వతంత్ర వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుంది.

మొదట రాణా తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, చట్టప్రకారం కారుణ్య మరణానికి అనుమతి లేదని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరఫున ఇంటివద్దే వైద్య సహాయం అందిస్తామని హామీ రావడంతో గతంలో కేసును సుప్రీంకోర్టు ముగించింది. అయినప్పటికీ, రాణా ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ ఏడాది జనవరి 15న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గౌరవంగా మరణించే హక్కుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల ప్రకారం, రాణా విషయంలో కారుణ్య మరణానికి అనుమతిపై నేటి తీర్పుతో స్పష్టత రానుంది.


More Telugu News