టీ20 ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లడంపై రగడ.. కీర్తి ఆజాద్‌ వ్యాఖ్యలకు హర్భజన్ కౌంటర్

  • వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి వెళ్లిన భారత జట్టు
  • అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు ఎందుకు వెళ్లలేదని కీర్తి ఆజాద్ ప్రశ్న
  • భక్తిని రాజకీయం చేయడం సరికాదన్న హర్భజన్ సింగ్
  • అనవసర వివాదాలు వద్దని తేల్చిచెప్పిన ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు చుట్టూ ఇప్పుడు ఒక రాజకీయ వివాదం ముసురుకుంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ట్రోఫీతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ఈ అంశంపై మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

1983 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ దీన్ని తప్పుబట్టారు. "భారత జట్టు కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, 140 కోట్ల భారతీయులది. కేవలం ఆలయానికి మాత్రమే ఎందుకు వెళ్లారు? మసీదు, చర్చి లేదా గురుద్వారాకు ఎందుకు వెళ్లలేదు?" అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 1983లో తాము గెలిచినప్పుడు జట్టులో అన్ని మతాల వారు ఉన్నారని, ట్రోఫీని దేశానికి అంకితం చేశాం తప్ప ఇలా రాజకీయం చేయలేదని ఆయన మండిపడ్డారు.

కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఆటగాళ్లు తమ నమ్మకం ప్రకారం దైవదర్శనం చేసుకుంటే అందులో రాజకీయం వెతకడం అసంబద్ధమని అన్నాడు. "గుడి, మసీదు, చర్చి.. ఏదైనా ఒకటే. కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు దేవుడికి మొక్కు చెల్లించుకోవడంలో తప్పేముంది? ఒక మాజీ క్రీడాకారుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. క్రీడల కంటే రాజకీయాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది" అని హర్భజన్ చురకలు అంటించాడు.

మరోవైపు, పాట్నా విమానాశ్రయంలో మీడియా ఈ వివాదంపై ప్రశ్నించగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అసహనం వ్యక్తం చేశాడు. "మేము అద్భుతమైన ప్రపంచకప్‌ను గెలిచాం. ఆ సంతోషాన్ని వదిలేసి ఇలాంటి అనవసర ప్రశ్నలు అడగొద్దు. మంచి విషయాల గురించి మాట్లాడండి" అంటూ వివాదానికి దూరంగా ఉండాలని సూచించారు.


More Telugu News