భారత్ దౌత్య నీతికి దొరికిపోయిన పాక్.. ఐరాసలో బహిర్గతమైన నిజం

  • ఐరాసలో భారత్ పన్నిన దౌత్య వ్యూహంలో చిక్కుకున్న పాకిస్థాన్
  • ఆఫ్ఘ‌న్‌పై వైమానిక దాడుల అంశాన్ని పరోక్షంగా అంగీకరించిన ఇస్లామాబాద్
  • భారత్ సాయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పకనే చెప్పిన పాక్ ప్రతినిధి
  • ఆఫ్ఘ‌న్‌ ప్రజలకు భారత్ అందిస్తున్న సాయాన్ని వివరించిన భారత ప్రతినిధి
  • అద్దంలో చూసుకోవాలంటూ పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా కౌంటర్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్ దౌత్యపరంగా తప్పులో కాలేసింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌పై తాము జరుపుతున్న వైమానిక దాడులు, ఆ దేశంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి విషయాలను పరోక్షంగా అంగీకరించింది. భారత్ పన్నిన వ్యూహాత్మక విమర్శలకు నేరుగా స్పందించి, పాకిస్థాన్ తన తప్పును తానే బయటపెట్టుకుంది.

సోమవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ ప్రసంగిస్తూ, ఏ దేశం పేరునూ ప్రస్తావించకుండా ఆఫ్ఘ‌నిస్థాన్‌పై జరుగుతున్న వైమానిక దాడులను, సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా విమర్శించారు. "పవిత్ర రంజాన్ మాసంలో వైమానిక దాడులు చేస్తూ అమాయక పౌరులను చంపడం దారుణం. ఈ నెల‌ 6 నాటికి ఈ దాడుల్లో 185 మంది పౌరులు చనిపోయారు. వారిలో 55 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ సమాజం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సాధారణంగా దౌత్యపరమైన చర్చల్లో పేరు ఎత్తనప్పుడు ఏ దేశమూ స్పందించదు. కానీ, ఈ విమర్శలు తమ గురించేనని భావించిన పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ స్పందించారు. దీంతో భారత్ పన్నిన ఉచ్చులో ఆయన చిక్కుకున్నారు. భారత్‌పై నిందలు వేసే క్రమంలో ఆయన మాట్లాడుతూ, "మా కచ్చితమైన, ప్రభావవంతమైన చర్యల వల్ల ఆఫ్ఘ‌నిస్థాన్‌లో భారత్ పెట్టిన భారీ పెట్టుబడులు వృథా అవుతున్నందుకు వారు బాధపడుతున్నారు" అని వ్యాఖ్యానించారు. ఆఫ్ఘ‌న్‌లో భారత్ చేస్తున్న మానవతా సాయాన్ని పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అంగీకరించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.

అంతకుముందు భారత ప్రతినిధి హరీశ్ మాట్లాడుతూ.. భారత్ ఆఫ్ఘ‌నిస్థాన్‌కు అందిస్తున్న భారీ సహాయాన్ని వివరించారు. గత నాలుగేళ్లలో 50,000 టన్నుల గోధుమలు, 380 టన్నుల మందులు, 3,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించామని తెలిపారు.

పాక్ ప్రతినిధి వ్యాఖ్యలకు భారత ప్రతినిధి హరీశ్ గట్టిగా బదులిచ్చారు. "భారత్ సహాయం ఆఫ్ఘ‌నిస్థాన్ స్నేహపూర్వక ప్రజలకు మాత్రమే. ఇతరులను నిందించే బదులు పాకిస్థాన్ అద్దంలో తన ముఖం చూసుకుంటే మంచిది" అని చురక అంటించారు. ఇదే సమయంలో క్రికెట్ ప్రపంచకప్‌లో ఆఫ్ఘ‌న్ జట్టు ఆటతీరును ప్రశంసిస్తూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆ జట్టు ఆనందాన్ని పంచిందని, వారి ప్రయాణంలో భాగమైనందుకు భారత్ గర్విస్తోందని పేర్కొన్నారు.


More Telugu News