అమెరికాలో 'స్లీపర్ సెల్స్' అలర్ట్.. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ నుంచి రహస్య సంకేతాలు!

  • ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను గుర్తించిన అమెరికా నిఘా సంస్థలు
  • విదేశాల్లో ఉన్న ఏజెంట్లను యాక్టివేట్ చేసే ఛాన్స్
  • హై అలర్ట్‌లో ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ
  • ఇరాన్ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నాశనం చేస్తామన్న ట్రంప్
  • ప్రస్తుతానికి ఎక్కడా నిర్దిష్టమైన ముప్పు లేదని వెల్లడి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం తన 'స్లీపర్ సెల్స్' ( నిద్రాణంగా ఉన్న ఉగ్రవాద ముఠాలు)ను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తోందని సంచలన నివేదికలు వెలువడుతున్నాయి. ఇరాన్ నుంచి వెలువడిన కొన్ని రహస్య 'ఎన్‌క్రిప్టెడ్' సందేశాలను అమెరికా నిఘా సంస్థలు అడ్డుకున్నాయి. ఇవి విదేశాల్లో ఉన్న ఇరాన్ ఏజెంట్లకు దాడులు చేయాలని ఇచ్చే సంకేతాలు కావచ్చని ఏబీసీ న్యూస్ వెల్లడించింది.

ఫిబ్రవరి 28న ఖమేనీ మృతి చెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక కొత్త రేడియో స్టేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సందేశాలు వెలువడ్డాయి. ఇవి ఇంటర్నెట్ లేదా సెల్ ఫోన్ నెట్‌వర్క్ వాడకుండా, కేవలం క్లోజ్డ్ గ్రూపులకు మాత్రమే అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా విదేశాల్లో ఉన్న తమ ఏజెంట్లకు ఇరాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనివల్ల అమెరికా, యూరప్ దేశాల్లోని భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, ఇరాన్ గనుక ఏవైనా ‘పిచ్చి వేషాలు’ వేయాలని చూస్తే ఆ దేశం మ్యాప్‌లో లేకుండా పోతుందని హెచ్చరించారు. యుద్ధం దాదాపు ముగిసిందని, ఇరాన్ గగనతలం, నౌకాదళం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని స్థానిక పోలీసు విభాగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.


More Telugu News