పశ్చిమాసియా సంక్షోభం.. 67 వేల‌ మంది భారతీయులు స్వదేశానికి: మంత్రి జైశంకర్

  • రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
  • ఇరాన్‌లోని భారతీయులకు టెహ్రాన్ ఎంబసీ అండగా నిలుస్తోందని వెల్లడి
  • పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ మాట్లాడారని, ఉద్రిక్తతలు తగ్గించాలని కోరారని వెల్లడి
  • విపక్షాల నిరసనల మధ్యే సభకు వివరాలు అందించిన కేంద్ర మంత్రి
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి ఇప్పటివరకు 67,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. ఇవాళ‌ ఆయన రాజ్యసభలో పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై ఒక ప్రకటన చేశారు. సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, భారతీయుల భద్రతకు, వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని స్పష్టం చేశారు.

ఆయా ప్రాంతాల్లోని గగనతలాన్ని పాక్షికంగా తెరిచిన ప్రతీసారి, వాణిజ్య విమానాలతో పాటు ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నెల‌ 8వ తేదీ నాటికి ఈ సంఖ్య 67,000కు చేరిందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడం గమనార్హం. వారి నిరసనల మధ్యే జైశంకర్ తన ప్రకటనను పూర్తి చేశారు.

ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి విద్యార్థులకు, ఇతర పౌరులకు సహాయం అందించడానికి చర్యలు తీసుకుందని జైశంకర్ వివరించారు. పలువురు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వ్యాపార నిమిత్తం ఇరాన్‌లో ఉన్న భారతీయులు, పొరుగున ఉన్న అర్మేనియాకు వెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. టెహ్రాన్‌లోని ఎంబసీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, అత్యంత అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలోని పరిణామాలను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని జైశంకర్ సభకు తెలిపారు. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాధినేతలతో ప్రధాని మాట్లాడారని వెల్లడించారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అన్ని పక్షాలను కోరుతున్నామని చెప్పారు. తాను కూడా ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భారత సమాజం భద్రత, సంక్షేమానికి తమ దేశాలు ప్రాధాన్యతనిస్తాయని ఆయా దేశాల నాయకత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు. అమెరికాతో కూడా దౌత్య మార్గాల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News