ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!

  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు
  • విద్యార్థుల ఇబ్బందుల నివారణకు ప్రభుత్వ కొత్త ఆలోచన
  • హాల్‌టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది.

గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, పరీక్షా కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ వంటి వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల విద్యార్థులు ఎలాంటి గందరగోళం లేకుండా సమయానికి కేంద్రానికి చేరుకోవచ్చు.

ఈ కొత్త హాల్‌టికెట్‌పై విద్యార్థి ఫొటో, రోల్ నంబర్‌తో పాటు లీప్ యాప్, ప్రభుత్వ రాజముద్ర కూడా ఉన్నాయి. పరీక్షల సమయ పట్టికను కూడా స్పష్టంగా పొందుపరిచారు. ఇప్పటికే విడుదలైన ఈ హాల్‌టికెట్లను పాఠశాలల యాజమాన్యాలు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందిస్తాయి. ఇదిలా ఉంటే.. విద్యార్థులకు మరో సౌకర్యం కూడా కల్పించారు. పరీక్షల సమయంలో హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది.


More Telugu News