చరిత్ర సృష్టించిన టీమిండియాకు విషెస్ తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్

  • మొత్తం మూడు సార్లు కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు
  • 2024, 2026లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా
  • అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించిన మంత్రి లోకేశ్
  • సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, బుమ్రా ప్రదర్శన అద్భుతమని కితాబు
వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిన 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని వారు కొనియాడారు. 2007, 2024లో కప్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు 2026లోనూ ట్రోఫీని ముద్దాడి, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 2024, 2026లో వరుసగా రెండుసార్లు కప్ గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తూ.. ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా విజయం సాధించిందని, ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో భారత్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందని పేర్కొన్నారు. మూడుసార్లు కప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలవడం గర్వకారణమని, కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు.

మరోవైపు, అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా తిలకించారు. స్టేడియం అంతా నీలి సముద్రాన్ని తలపించిందని, ఈ వాతావరణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన ట్వీట్ చేశారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మల బ్యాటింగ్ మెరుపులు, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ స్పెల్ విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఇంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించిన ఐసీసీకి కూడా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఛాంపియన్స్ మరోసారి తమ సత్తా చాటారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


Nara Lokesh
Chandrababu Naidu
Team India
T20 World Cup
ICC
Cricket
India win
Sanju Samson
Jasprit Bumrah
Abhishek Sharma

More Telugu News