Anurag Dobhal: లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. 150 కి.మీ వేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

YouTuber Anurag Dobhal AKA UK07 Rider Attempts Suicide in Live Video
  • ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఆత్మహత్యా యత్నం
  • ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగానే కారుతో డివైడర్‌కు ఢీ
  • కులాంతర వివాహంపై కుటుంబ వేధింపులే కారణమని ఆరోపణలు
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్-17 కంటెస్టెంట్ అనురాగ్ డోభాల్ ('UK07 రైడర్') ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై తన ఫార్చ్యూనర్ కారును వేగంగా నడుపుతూ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి ముందు అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. "అమ్మా.. వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వండి.. మనం చివరి ప్రయాణానికి వెళ్దాం" అంటూ తన అనుచరులతో చెబుతూనే కారు వేగాన్ని అమాంతం పెంచారు. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో లైవ్ ఆగిపోయింది.

కొంతకాలంగా అనురాగ్ తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేసుకున్న కులాంతర వివాహాన్ని కుటుంబం వ్యతిరేకించడమే కాకుండా, తనను ఆర్థికంగా, సామాజికంగా ఒంటరిని చేశారని గతంలో ఆయన ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం "నన్ను బతికే స్థితిలో ఉంచలేదు" అంటూ ఆయన పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి నుజ్జునుజ్జయిన కారులోంచి అనురాగ్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన మీరట్‌లోని సుభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్న యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు, నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Anurag Dobhal
UK07 Rider
Big Boss 17
YouTuber accident
Delhi Meerut Expressway
car accident live
suicide attempt
social media influencer
caste marriage issues
Subharti Hospital Meerut

More Telugu News