చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: ధూళిపాళ్ల

  • వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారమన్న ధూళిపాళ్ల
  • సిట్ దర్యాప్తులో రూ. 234 కోట్ల నెయ్యి దందా గుట్టు రట్టయిందని వ్యాఖ్యలు
  • అధికారంలో ఉన్నప్పుడు నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కింది మీరు కాదా అంటూ విమర్శలు
  • హెరిటేజ్‌ను దూరంగా పెట్టిన బాబు ఎక్కడ.. సిమెంట్ కోసం రేట్లు పెంచిన జగన్ ఎక్కడ అంటూ ఫైర్
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కొట్టిపారేశారు. తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒక ‘బ్యాండ్ ఆఫ్ సైకోలు’గా మారి తప్పుడు ప్రచారాలు వ్రచేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య సుమారు 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దీని విలువ రూ. 234 కోట్లు ఉంటుందని 'సిట్' దర్యాప్తులో తేలిందని ధూళిపాళ్ల వెల్లడించారు. ఈ అక్రమాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని, విజయవాడకు రూ. 12.5 కోట్లు, అక్కడి నుంచి హవాలా మార్గంలో చెన్నైకి రూ. 7.5 కోట్లు తరలినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఎంపీ ఇంట్లో టెండర్ల కోసం రూ. 50 లక్షలు డిమాండ్ చేసి, రూ. 30 లక్షలు వసూలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు టీటీడీలో కీలక స్థానాల్లో ఉండి, 'కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి' అనే నిబంధనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ సూచనలను పక్కనపెట్టి, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కిన చరిత్ర వైసీపీదని ధ్వజమెత్తారు.

సంగం డెయిరీకి ఆవు పాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని నరేంద్ర ఎద్దేవా చేశారు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు సహా పలు జిల్లాల నుంచి తాము ప్రతిరోజూ 5,15,000 లీటర్ల ఆవు పాలను సేకరిస్తున్నామని లెక్కలతో సహా వివరించారు. దమ్ముంటే జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి తనతో వస్తే సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆ సేకరణ వ్యవస్థను చూపిస్తానని సవాల్ విసిరారు. మార్కెట్‌లో బటర్ ధర రూ. 520, అమూల్, కేఎంఎఫ్ నెయ్యి ధరలు రూ. 700 పైమాటే ఉన్నప్పుడు, తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పాలు వాడకుండా కేవలం కెమికల్స్, స్టెరాయిడ్స్‌తో నెయ్యి తయారు చేసే పేటెంట్ హక్కులు వైసీపీ నేతలకే దక్కుతాయన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ను టీటీడీ టెండర్లకు ఎప్పుడూ దూరంగా ఉంచారని, అదే జగన్ విషయానికొస్తే, సాక్షి పత్రికకు రూ. 347 కోట్ల ప్రజాధనం దోచిపెట్టారని, భారతీ సిమెంట్స్ కోసం ఇళ్ల నిర్మాణ ఖర్చు పెంచారని ధూళిపాళ్ల విమర్శించారు. చేసిన తప్పులు ఒప్పుకుని దేవుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి, ఏఐ (ఏఐ) ద్వారా ఫేక్ వీడియోలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.




More Telugu News