యుద్ధ భయాలతో మార్కెట్లు విలవిల... కుప్పకూలిన సూచీలు!

  • అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం
  • ఒక్కరోజే 1097 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడితో పెరిగిన చమురు ధరలు
  • భారీగా పడిపోయిన బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు
  • డాలర్‌తో పోలిస్తే 91.84 స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏడో రోజుకు చేరుకోవడంతో శుక్రవారం దలాల్ స్ట్రీట్ విలవిల్లాడింది. ఆయిల్ ధరలు భగ్గుమనడం, యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో సూచీలు కుప్పకూలాయి.

మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,097 పాయింట్లు కోల్పోయి 78,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయి 24,450 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2.15 శాతం పతనమై 57,783 వద్దకు చేరింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాలను చవిచూశాయి.

సెక్టార్ల వారీగా పరిశీలిస్తే.. ప్రైవేట్ బ్యాంక్, పిఎస్‌యు బ్యాంక్, రియల్టీ రంగాలు టాప్ లూజర్స్ గా నిలిచాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మరోవైపు యుద్ధ వాతావరణం కారణంగా డిఫెన్స్ షేర్లలో మాత్రం జోరు కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో పలు డిఫెన్స్ కంపెనీల షేర్లు, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు 9 శాతం వరకు లాభపడటం గమనార్హం.

ఇరాన్ క్షిపణి దాడులతో బహ్రెయిన్‌లోని ఆయిల్ రిఫైనరీ దెబ్బతినడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతుండగా, అమెరికన్ క్రూడ్ 81 డాలర్లు దాటింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.09 శాతం తగ్గి 91.84 వద్ద ముగిసింది. మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో ఇండియా విక్స్ (వీఐఎక్స్) సూచీ 11 శాతం పెరిగింది. ప్రస్తుతం నిఫ్టీకి 24,500 పాయింట్లు కీలక మద్దతుగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.


More Telugu News