టీ20 వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో రికీ మార్టిన్ షో

  • ఈ నెల 8న టీ20 వరల్డ్ కప్ పైనల్
  • టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • అహ్మదాబాద్ లో అంతిమ సమరం
  • ముగింపు వేడుకల్లో రికీ మార్టిన్ ప్రదర్శన
  • సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ముగింపు వేడుకలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రికీ మార్టిన్ తన ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు.

ఈ ముగింపు వేడుకల్లో రికీ మార్టిన్ లైవ్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ వినోద కార్యక్రమం ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. "టీ20 వరల్డ్ కప్ వేడుక మరింత ఘనంగా మారింది. ఫైనల్‌కు ముందు జరిగే ముగింపు వేడుకల్లో గ్లోబల్ ఐకాన్ రికీ మార్టిన్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకను ఎవరూ మిస్ కావద్దు" అని ఐసీసీ పేర్కొంది. మధ్యాహ్నం 3:30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.

వినోద కార్యక్రమాల అనంతరం రాత్రి 7:00 గంటలకు అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా గురువారం వాంఖడేలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ చేరింది. టీ20 చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి కావడం విశేషం. మరోవైపు, బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ ఫైనల్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి అనేక రికార్డులను తిరగరాయాలని భారత్ భావిస్తోంది. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా, టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా, అలాగే మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.


More Telugu News