Harisingh Malaviya: పరీక్ష రాయడానికి వెళ్తున్న అక్కాతమ్ముళ్లను కడతేర్చిన బాబాయ్!

Madhya Pradesh Uncle Kills Teen Siblings Over Family Feud
  • దారి కాచి కర్రతో విచక్షణారహితంగా దాడి
  • తీవ్ర రక్తస్రావం కారణంగా స్పాట్ లోనే మరణించిన అక్కాతమ్ముళ్లు
  • కుటుంబ ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణం


చేతిలో హాల్‌టిక్కెట్లు పట్టుకుని, భవిష్యత్తుపై వెయ్యి ఆశలతో పరీక్షా కేంద్రానికి బయలుదేరిన అక్కాతమ్ముళ్లను సొంత బాబాయ్ కడతేర్చాడు. కుటుంబ గొడవల నేపథ్యంలో దారికాచి వారిని కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా ధరమ్‌పురి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధరమ్‌పురి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు శీతల్ (20), కుల్దీప్ (18) శుక్రవారం ఉదయం తమ బోర్డ్ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉదయాన్నే హాల్‌ టిక్కెట్లు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి కొద్దిదూరం వెళ్లగానే, దారిలో పొంచి ఉన్న వారి సొంత బాబాయ్ హరిసింగ్ మాలవీయ ఒక్కసారిగా కర్రతో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు.

హాల్‌ టిక్కెట్లు రక్తసిక్తమయ్యాయి..

పరీక్ష రాసేందుకు వెళ్లిన బిడ్డలు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకుని కుటుంబానికి వెలుగునిస్తారనుకున్న బిడ్డలను సొంత బాబాయే కొట్టి చంపడం కలిచివేస్తోంది. వారి హాల్‌టిక్కెట్లు రక్తంతో తడిసిపోవడం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘వాళ్లు పరీక్షకు వెళుతున్నారని అతడి(వారి బాబాయి)కి తెలుసు. ఉదయం నుంచే అక్కడ కాపుకాచి మా ఇంటి దీపాలను ఆర్పేశాడు. చదువుకుని గొప్పవాళ్లవుతారనుకుంటే.. ఇలా శవాలుగా పడి ఉన్నారు’’ అంటూ మృతుల తండ్రి జగదీశ్ మాలవీయ రోదించారు. కుటుంబ ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.


పోలీసుల గాలింపు..

ఈ దారుణానికి పాల్పడిన హరిసింగ్ పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట హత్యలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య చేసి పారిపోయిన హరిసింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Harisingh Malaviya
Sehore district
Madhya Pradesh
murder
family dispute
board exams
crime news
Kuldeep
Sheetal
Dharampuri

More Telugu News