Air India: మధ్యప్రాచ్యానికి పాక్షికంగా విమానాలు.. సేవలు పునరుద్ధరించిన భార‌తీయ విమాన‌యాన‌ సంస్థలు

Middle East Flights Partially Resume by Indian Airlines like Air India
  • సేవలు ప్రారంభించిన ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్
  • కొనసాగుతున్న గగనతల ఆంక్షలు.. వేలల్లో రద్దయిన సర్వీసులు
  • ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానాలు, రీబుకింగ్ సదుపాయం
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు ఇవాళ్టి నుంచి పాక్షికంగా పునరుద్ధరించాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు పరిమిత సంఖ్యలో మధ్యప్రాచ్యానికి రాకపోకలు ప్రారంభించాయి. 

విమానయాన సంస్థల వారీగా వివరాల్లోకి వెళితే... ఇండిగో ఇవాళ‌ ఎనిమిది మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు 17 విమానాలను (34 సెక్టార్లు) నడపనున్నట్లు తెలిపింది. సురక్షితమైన రీతిలో సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. సౌదీ అరేబియా, ఒమన్‌ గగనతలాలు తెరుచుకోవడంతో జెడ్డా, మస్కట్‌లకు విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. మరోవైపు స్పైస్‌జెట్ ఉద్రిక్తతల నడుమ ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ నెల‌ 6, 7 తేదీల్లో యూఏఈ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానాలను, ఈ నెల‌ 8న అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది.

సంస్థలు తమను నేరుగా సంప్రదించిన తర్వాతే ప్రయాణికులు విమానాశ్రయాలకు రావాలని ఇండిగో స్పష్టంగా సూచించింది. ఇక ఎయిరిండియా.. దుబాయ్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా వంటి హబ్‌ల నుంచి ఇవాళ‌ ప్రత్యేక విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇతర పశ్చిమాసియా గమ్యస్థానాలకు మార్చి 10 వరకు తమ షెడ్యూల్డ్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల‌ 8 మధ్య ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎలాంటి అదనపు ఛార్జీలు, ఛార్జీల వ్యత్యాసం లేకుండా నెల రోజుల్లోగా తమ టికెట్లను రీబుక్ చేసుకోవచ్చని భరోసా ఇచ్చింది.

విమానయాన పరిశ్రమ డేటా ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల‌ 5 మధ్య మధ్యప్రాచ్యంలో 44,000 విమానాలు నడవాల్సి ఉండగా, ఇప్పటివరకు 25,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. అయితే, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ట్రాఫిక్ సాధారణ స్థాయిలతో పోలిస్తే 25 శాతానికి చేరింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది. చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేసేందుకు ప్రత్యేకంగా 'ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్' ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ సమయంలో విమాన టికెట్ల ధరలు పెరగకుండా కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది.
Air India
Middle East flights
Indigo flights
SpiceJet flights
India flight services
flight disruptions
UAE flights
Saudi Arabia flights
Oman flights
aviation industry

More Telugu News