వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లిచ్చేది నేనే: సీఎం చంద్రబాబు

  • వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటితో 30 ఏళ్లు పూర్తి
  • నాడు ప్రకాశం ప్రజల కష్టాలు చూడలేకే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టానన్న సీఎం
  • ఈ ఏడాది జులై నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తాం
  • 2027-28 నాటికి వెలిగొండ ఫేజ్-2 పనులు కూడా పూర్తి చేస్తామని వెల్లడి
  • గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం చేసిందని విమర్శ
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నేటితో (మార్చి 5) సరిగ్గా 30 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే... పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే" అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ అయిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రజలతో పంచుకున్నారు.

1996 మార్చి 5వ తేదీ తనకు ఇంకా స్పష్టంగా గుర్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆనాడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తీవ్ర కరవు కాటకాలతో, కనీసం తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ ప్రజల కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు వేశానని గుర్తుచేసుకున్నారు. శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి 43.50 టీఎంసీల నీటిని మళ్లించి... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే బృహత్తర లక్ష్యంతో నాడు వెలిగొండకు భూమిపూజ చేశామని తెలిపారు.

అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి 2014-19 మధ్య తమ ప్రభుత్వ హయాంలో రూ.1,414 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశామన్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలంటూ ప్రజలను మోసం చేసి నవ్వులపాలైందని విమర్శించారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. గతంలో పెండింగ్ ఉన్న రూ.140 కోట్ల బిల్లులను వెంటనే క్లియర్ చేశామని, ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటివరకు రూ.585 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్‌ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతుల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ ఏడాది (2026) జులై నాటికి వెలిగొండ తొలి దశ (ఫేజ్-1) పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే 2027-28 నాటికి ఫేజ్-2 నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. కరవు ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి, హార్టికల్చర్ సాగును ప్రోత్సహించి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News