Raghurama Krishnam Raju: రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
- ఏపీ హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన సునీల్ నాయక్
- గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న విచారణ
- నేటి నుంచి 9వ తేదీ వరకు కొనసాగనున్న విచారణ
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 'కస్టడీలో హత్యాయత్నం' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా (A-7) ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు సునీల్ నాయక్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారించనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, 2021 మే నెలలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రంతా ఆయనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచారు. ఆ సమయంలో సీఐడీ డీఐజీగా ఉన్న సునీల్ నాయక్, ఆ రాత్రి వేళ పలుమార్లు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. దీంతో, ఆయనను ఈ కేసులో ఏ-7గా చేర్చారు. విచారణకు రావాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు.
ఈ క్రమంలో, సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు పాట్నా వరకు వెళ్లినా, సాంకేతిక కారణాల వల్ల తీసుకురాలేకపోయారు. అయితే, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ నాయక్‌కు నిరాశ ఎదురైంది. విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ విచారణలో ఆ రాత్రి జరిగిన పరిణామాలపై పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.