వంట మనిషి దొంగతనాన్ని పట్టించిన ‘ఏఐ’ రూమ్మేట్!
- బెంగళూరులో టెకీ వినూత్న ప్రయోగం.. వంట మనిషిపై ఏఐతో నిఘా
- సీసీ టీవీ కెమెరా ద్వారా ఆమె కదలికలను పరిశీలించిన ఏఐ
- ఫ్రిడ్జిలో నుంచి ఎప్పుడు ఎన్ని పళ్లు దొంగిలించిందో చిట్టా బయటపెట్టిన కృత్రిమ మేధ
ఏఐ పంపిన నివేదిక..
వంటగదిలోని కెమెరాను ‘Claude Haiku 4.5’ అనే ఏఐ టూల్‌కు అనుసంధానించినట్లు టెకీ తెలిపాడు. ఈ టూల్ సీసీటీవీ ద్వారా వంట మనిషి ప్రతి కదలికను విశ్లేషించి రాతపూర్వక నివేదికను పంపుతుంది. ఆ నివేదికలో ఏముందంటే..
పండ్ల దొంగతనం..‘‘ఆమె సాయంత్రం 7:12 గంటలకు వచ్చింది. రాగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో నుంచి రెండు యాపిల్స్ తీసి తన బ్యాగ్‌లో వేసుకుంది’’
అపరిశుభ్రత..
‘‘ఆమె డస్ట్ బిన్ మూతను తాకింది, ముక్కు రుద్దుకుంది.. ఆపై అదే చేతులతో చపాతీలు చుట్టింది’’
నిర్లక్ష్యం..
‘‘స్టవ్ వెనుక ఉన్న భాగాన్ని సోమవారం నుంచి ఆమె శుభ్రం చేయలేదు’’
వీక్లీ రిపోర్ట్.. ఫైనల్ వార్నింగ్!
వారానికి ఒకసారి ఆ ఏఐ పంపే రిపోర్ట్‌లో ఎన్ని యాపిల్స్ పోయాయి, ఎన్ని అరటిపండ్లు మాయమయ్యాయి, చివరకు ఆమె ఎన్ని బ్లూబెర్రీలు తిన్నదో కూడా లెక్కలతో పాటు ఉంది. ‘‘ఈ పనులకి ఆమె నెలకు రూ.4,800 బిల్లు వేస్తోంది’’ అంటూ ఆ ఏఐ సిస్టమ్ యజమానికి గుర్తు చేయడం విశేషం. ఈ నివేదికల ఆధారంగా ఆ టెక్కీ సదరు వంట మనిషిని పనిలో నుంచి తొలగించాడు.
సోషల్ మీడియాలో చర్చ
ఈ వార్త ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది. ‘‘ఇంత నిశితంగా గమనిస్తే ఏ వంట మనిషీ మీ ఇంట్లో వారం కంటే ఎక్కువ ఉండదు’’ అని కొందరు చమత్కరిస్తే.. ‘‘ఇలాంటి టెక్నాలజీని ఏటీఎంలు, బస్సు స్టాపుల్లో వాడితే నేరాలను అరికట్టవచ్చు కదా!’’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.