ఐపీఎల్‌లో సీఎస్‌కేకు విజిల్ వేస్తే ఎన్నికల్లో టీవీకే విజిల్‌కు ఓటేస్తారు: నటుడు విజయ్

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తనకు భావోద్వేగమన్న నటుడు విజయ్
  • మిగతా పార్టీలకు సాధారణ ఎన్నిక అని వ్యాఖ్య
  • ఢిల్లీ బీజేపీతో పాటు అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందన్న విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తనకు, తనను ప్రేమించే వారికి భావోద్వేగమని ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలు మిగతా పార్టీ వారికి సాధారణమే అన్నారు. తమకు మాత్రం ఒక భావోద్వేగమని వ్యాఖ్యానించారు. తంజావూరు జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పార్టీ మేనిఫెస్టోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్ బీజేపీతో పాటు అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఐపీఎల్ క్రికెట్‌లో తమిళనాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు విజిల్ వేస్తే ఈ ఎన్నికల్లో టీవీకే విజిల్ గుర్తు మారుమోగుతుందని అన్నారు. ప్రజలకు తనతో ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని అన్నారు.

ఈ సందర్భంగా తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానో హామీలు ఇచ్చారు. రెండెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతు బిడ్డల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. అయితే ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదనే నిబంధనను కూడా ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు చేయలేని పేద కుటుంబాలకు సహకరించాలనేది తన ఉద్దేశమని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


More Telugu News