Ambati Rambabu: సత్తెనపల్లిలో నాకున్న 22 ఎకరాల పొలాన్ని సర్వే చేయాలని నోటీసులు ఇచ్చారు: అంబటి రాంబాబు

Ambati Rambabu Alleges Political Vendetta Over Land Survey
  • తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారన్న అంబటి
  • చంద్రబాబు, లోకేశ్ కు వేరే పనేం లేదా అని ప్రశ్న
  • గుంటూరులోని తన నివాసానికి కూడా నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తన కుటుంబంపై జరిగిన దాడులను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సత్తెనపల్లిలో తనకు ఉన్న 22 ఎకరాల పొలాన్ని సర్వే చేయాలంటూ ఎమ్మార్వో కార్యాలయం నుంచి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది తనకు చెప్పారని వెల్లడించారు.


తన పొలంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్‌ను సాకుగా చూపి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. "సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు నా ఆస్తులపై పడటం తప్ప వేరే పనేం లేదా?" అని ఆయన నిలదీశారు. తాను ఆ పొలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, తాను కొనకముందే అందులో ఒక చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని స్పష్టం చేశారు. తన వద్ద దాపరికాలు లేవని, చంద్రబాబు లేదా లోకేశ్ ఎవరైనా వచ్చి తన పొలాన్ని చూసుకోవచ్చని సవాల్ విసిరారు. 

తనను భయపెట్టడానికే ఈ నోటీసులు ఇస్తున్నారని, రేపు తన గుంటూరు నివాసానికి కూడా నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని అంబటి రాంబాబు హితవు పలికారు.
Ambati Rambabu
Andhra Pradesh Politics
YSRCP
Chandrababu Naidu
Lokesh
Sattenapalli
Land Survey
Political Vendetta
Guntur

More Telugu News