అవయవదానంలో ఏపీ స్థానం ఎంతంటే...!

  • అవయవదానంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో నిలిచిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
  • గత రెండు నెలల్లో 64 మందికి అవయవ మార్పిడి జరిగినట్లు వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా 5,000 మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారన్న మంత్రి
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పిడి శస్త్రచికిత్సలు పెంచాలని ఆదేశాలు
అవయవదానంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచిందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. జీవన్‌దాన్ కార్యక్రమంపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగిందని అన్నారు. 

ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి సేకరించిన అవయవాలతో 64 మందికి పునర్జన్మ లభించిందని మంత్రి వివరించారు. గతంతో పోలిస్తే ఇది చాలా మెరుగైన స్పందన అని పేర్కొన్నారు. గతేడాది (2025లో) 93 మంది దాతల ద్వారా 301 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 మంది వివిధ అవయవాల కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నారని, వీరిలో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్యను మరింత పెంచాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా, అవయవ మార్పిడికి అనుమతి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను ఇప్పటికే 3 నుంచి 9కి పెంచినట్లు గుర్తుచేశారు. అవయవదానం చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News