BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ప్రచారం... గాగ్ ఆర్డర్ ఇచ్చిన హైదరాబాద్ కోర్టు

BR Naidu Gets Gag Order Against Defamatory News
  • టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
  • ఆయనపై ఆధారరహిత కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాకు ఆదేశం
  • ఇప్పటికే ప్రచురితమైన కంటెంట్‌ను తొలగించాలని స్పష్టం
  • గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకూ కోర్టు కీలక ఆదేశాలు జారీ
  • ఇది తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర అని ఆరోపించిన బీఆర్ నాయుడు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ కోర్టులో భారీ ఊరట లభించింది. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

తనపై ఎలాంటి ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ప్రసారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కోర్టు స్పష్టంగా ఆదేశించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్లు వివరించారు. ఇదే సమయంలో గూగుల్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం సంబంధిత కంటెంట్‌ను తమ సైట్ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినట్లు నాయుడు పేర్కొన్నారు.

తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. "సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.


BR Naidu
TTD Chairman
Gag Order
Hyderabad Court
Defamation
Social Media
Tirumala
AI Videos
Morphing Videos
Fake News

More Telugu News