రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై హెల్త్ బులిటెన్ విడుదల

  • పాలు తాగిన వారి రక్తంలో పెరిగిన యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయులు
  • ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుందన్న వైద్యులు
  • వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 11 మంది బాధితులు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాధితులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో అత్యంత భయానక వాస్తవాలు వెలుగుచూశాయి. పాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయులు అసాధారణంగా పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఇది నేరుగా మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుందని, పాలల్లో కలిపిన అత్యంత విషపూరిత పదార్థాల వల్లే ఇలా జరిగిందని ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలో నిర్ధారించారు.

 

ఈ కల్తీ పాలు కోరుకొండ మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న 'వరలక్ష్మీ మిల్క్ డెయిరీ' నుంచి సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. సదరు డెయిరీ నుంచి సుమారు 106 కుటుంబాలకు ఈ పాలు అందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం, ఆ డెయిరీ నుంచి పాల సరఫరాను నిలిపివేయడంతో పాటు ప్లాంట్‌ను సీజ్ చేసింది. బాధితుల్లో ఎక్కువ శాతం లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌కు చెందినవారు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితుల్లో 11 మందికి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.



More Telugu News