శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. అఫిడవిట్ దాఖలు చేయాలని దేవస్వమ్ బోర్డు నిర్ణయం

Travancore Devaswom Board Key Decision on Womens Entry into Sabarimala Temple
  • మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు
  • తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు
  • మహిళల ప్రవేశంపై అదే ఆచారాన్ని కొనసాగించాలని అఫిడవిట్ దాఖలు చేయనున్న బోర్డు
శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు నిర్ణయించింది.

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆలయంలో దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయాన్ని తాము సమర్థిస్తున్నామని, మహిళల ప్రవేశంపై అదే ఆచారం కొనసాగాలని బోర్డు తెలిపింది. మార్చి 14వ తేదీ లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు.

మహిళల ప్రవేశానికి సంబంధించి పాత సంప్రదాయాన్నే కొనసాగించాలనే విషయంలో బోర్డులో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవని బోర్డు సభ్యులు తెలిపారు. దేవాలయం పవిత్రతను, పురాతన సంప్రదాయాలను కాపాడటమే బోర్డు ప్రాథమిక బాధ్యత అన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అఫిడవిట్ సమర్పిస్తామని వెల్లడించారు.
Go Back to Shorts
Travancore Devaswom Board
Sabarimala temple
Sabarimala women entry
Supreme court verdict

More Telugu News