సొంత ఊరిలో 'విజయ్-రష్మిక' సందడి.. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం.. ఊరందరికీ అదిరిపోయే 'దావత్'!

  • సొంతూరులోని ఫామ్ లో కొత్త ఇంటిని నిర్మించుకున్న విజయ్ దేవరకొండ
  • సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించిన నూతన దంపతులు
  • ఈ నెల 4న హైదరాబాద్ లో రిసెప్షన్

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు వివాహం తర్వాత తొలిసారి విజయ్ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేటకు చేరుకున్నారు. ఈ ఉదయం గ్రామానికి చేరుకున్న ఈ నూతన వధూవరులకు గ్రామస్థులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఫామ్ లో నూతనంగా నిర్మించిన గృహంలోకి విజయ్-రష్మిక దంపతులు గృహప్రవేశం చేశారు. అనంతరం వేద పండితుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య జరిగిన ఈ వేడుకలో విజయ్ దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు.


సినీ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన మూలాలను మర్చిపోకుండా విజయ్ తన సొంత ఊరికి రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గృహప్రవేశం అనంతరం విజయ్ గ్రామస్థులందరికీ భారీ విందు (దావత్) ఏర్పాటు చేశారు. ఊరందరినీ పిలిచి విందు ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ వద్ద విజయ్, రష్మికలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు, గ్రామస్థులు పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీరి పెళ్లి రిసెప్షన్ ఈ నెల 4న హైదరాబాద్‌ లో జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.



More Telugu News