శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్

  • కనిపించకుండా పోయిన తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు.. పరారీలో భర్త
  • మద్యపానం వ్యసనంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ
  • గత నెల 27న కూడా గొడవపడ్డ భార్యాభర్తలు.. ఆ తర్వాత నలుగురు మిస్సింగ్
శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. హెచ్‌.టి హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి వీరేశ్ కుటుంబంలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేశ్ తన తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు రోహిణి, రచనలతో కలిసి నివాసం ఉంటున్నాడు. 

మద్యానికి బానిసైన వీరేశ్ తరచూ ఇంట్లో గొడవ పడుతూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భర్త వేధింపులు భరించలేకపోయారో లేక మరేదైనా కారణమో కానీ, అదే రోజు రాత్రి తల్లి సుబ్బమ్మతో కలిసి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

బంధువుల ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు..
రెండు రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన బంధువులు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రొళ్ల ఎస్సై గౌతమి.. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, కుటుంబ సభ్యులు అదృశ్యమైనప్పటి నుంచి వీరేశ్ కూడా పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.


More Telugu News