Roja: డీఎంకే తరపున రోజా ప్రచారం.. చంద్రబాబుపై విమర్శలు

Roja Supports DMK in Tamil Nadu Elections Slams Chandrababu
  • స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రోజా
  • డీఎంకే పాలనపై ప్రశంసల జల్లు
  • స్టాలిన్‌ను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపు

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు.


ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలను రోజా ఆకాశానికెత్తారు. ముఖ్యంగా తమిళనాడులో మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రతినెలా వారి ఖాతాల్లో నేరుగా వెయ్యి రూపాయలు జమ చేయడం వంటి పథకాలు మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.


తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ఇటీవల మహిళల ఖాతాల్లో ఒకేసారి ఐదు వేల రూపాయలు జమ చేయడంతో విపక్ష నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తాను పూర్తిస్థాయిలో సమర్థిస్తున్నానని, దీనివల్ల కూలి పనులకు వెళ్లే పేద మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇంతటి గొప్ప మనసున్న నాయకుడిని తమిళ ప్రజలు భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని, సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధికి ప్రతిఫలంగా స్టాలిన్‌కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, తమిళ గడ్డపై డీఎంకే తరపున రోజా గళం విప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Roja
Roja Selvamani
DMK
MK Stalin
Tamil Nadu Elections
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Welfare Schemes
Women Empowerment

More Telugu News