ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'

  • ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి
  • హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ
  • నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని హెచ్చరిక
  • కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణ, సమయపాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు తప్పనిసరిగా చేరుకోవాలని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే దానిని 'లేట్ ఇన్‌'గా పరిగణిస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) ఉంటుంది. ఇక హాఫ్-డే సెలవు తీసుకునే వారికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం విధులకు హాజరయ్యేవారు ఒంటి గంట లోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే 'లేట్ ఇన్‌'గా లెక్కిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టేవారు 12:30 గంటల కంటే ముందు 'ఔట్ టైమ్' నమోదు చేయకూడదు.

పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైమ్ నమోదు చేసినా, ఉన్నత పాఠశాలల టీచర్లు సాయంత్రం 4 గంటల కంటే ముందు నమోదు చేసినా దానిని 'ఎర్లీ ఔట్'గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయం ఇన్-టైమ్ నమోదు చేసి, సాయంత్రం ఔట్-టైమ్ నమోదు చేయడం మరిచిపోతే, వారు ఆ రోజంతా గైర్హాజరైనట్లే లెక్క. అంటే ఉదయం వచ్చిన వెంటనే వెళ్లిపోయినట్లుగా భావిస్తారు.

నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత
పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడింది. గతంలో ఉన్న 10 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. హాజరు నమోదు చేసే యాప్ కొన్నిసార్లు సరిగా పనిచేయదని, అటువంటి సాంకేతిక సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వం తమను "ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ"గా చెప్పుకుంటూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం విరుద్ధమని సంఘం నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలపై పునరాలోచిస్తుందా? లేక యథాతథంగా అమలు చేస్తుందా? అనేది వేచి చూడాలి.


More Telugu News